నా బ్లాగు లిస్ట్‌

2, డిసెంబర్ 2016, శుక్రవారం

Maa Sobharaju madam.

పిన్నలైనా ,పెద్దలైనా ఎవరిని  తొలిసారిగా కలిసినా వారిని  ఆదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా సంభాషించి..." మేము ఎప్పుడూ టి.వి.లో చూసే ప్రముఖ గాయని ఈవిడేనా ? !!!     " ఒక పద్మశ్రీ స్థాయి వ్యక్తికి  , ఎదుటివారిలోని బెరుకు ను పోగొట్టేలాగా సామాన్యులతో ఇంత కలిసిపోయి ఉండగలగడం సాధ్యమేనా ??? !!!" అని అనుకోగలిగేట్లు చెస్తారంటే ఆ వ్యక్తి ఎంతటి నిగర్వి , నిరాడంబరి అయ్యి ఉండాలి ??

ఒక జగత్ప్రసిధ్ధ గాయనీమణి " మీ గురువు గారు నేను తన అభిమాన గాయకిని అని చెప్తారు కానీ మొట్టమొదటిసారిగా నాకు ఆన్నమయ్య కీర్తన నేర్పించి నాతో సినిమా లో పాడించింది మీ గురువు గారే " అని మా గురువు గారి గురించి  చెప్తారంటే ,....  ఎందరొ సంగీత దర్శకులు, గాయకులు " మీ  సంగీతం మాకు స్పూర్తిదాయకం , మీ గానం అద్భుతం అని పాదాభివందనాలు చెస్తున్నారంటే  ఆ వ్యక్తి లో  ఎంతటి సంగీత ప్రతిభ నిబిడీకృతమై ఉండాలి???

ఎంతో ప్రతిభ కలిగిన రచయితలూ, ఆధ్యాత్మికవేత్తలూ  ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్పృహ కు ముగ్ధులై , " అన్నమయ్య కీర్తనలకు ఎంతోమంది ఎన్నో రకాలుగా భాష్యం చెప్తారు కానీ మీరు చెప్పే భాష్యం  ఎక్కువ కన్విన్సింగ్ గా  ఉంటుంది  " అని  ప్రముఖ వేదికలపై చెప్తూ  చేతులెత్తి నమస్కరిస్తున్నారంటే ..... ఆ వ్యక్తి లో ఎంతటి ఆధ్యాత్మిక సంపద నిక్షిప్తమై ఉండాలి???

ఎంతోమందికి ప్రేరణగానూ , లక్ష్యం గానూ  కనిపించే  సినిమా రంగం నుండి ఎన్నో  అవకాశాలు వచ్చినా .......   బాహ్యాడంబరాలకు అవలీలగా గురి చేసే  యుక్త వయస్సు  నుండీ  .... ఆర్ధికావసరాలకు తలవంచక తప్పని నడి వయస్సు వరకూ... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తలవొగ్గక , "భగవత్సంబంధిత గానానికే నా గాత్రం అంకితం "  అని నిలబడి విజయ సాధించారంటే ఆ భక్తురాలి భక్తి లో ఎంతటి నిబధ్ధత , అంకితభావం ఉండాలి ???

లక్ష్య  దిశగా తన ప్రయాణం లో ఎన్నోసార్లు కుల- లింగ  వివక్షతలను ఎదుర్కొన్నా .... ఎన్నో కుట్రలకూ , కుతంత్రాలకూ గురి అవ్వవలసి వచ్చినా.... అదే పంథాలో శత్రువులను ఎదుర్కోగలిగిన అవకాశం, బలిమీ తనకూ ఉన్నా .... ఎన్నడూ ఆ వక్ర మార్గాన్ని  ఎంచుకోక, తాను నమ్మిన అన్నమాచార్యుడు బోధించిన   "  బ్రహ్మమొక్కటే " అన్న  సూత్రాన్ని మాత్రమే   ఆచరించి    లక్ష్యాన్ని సాధించి చూపారంటే ...  ఆ వ్యక్తికి తాను నమ్మిన మార్గంపట్ల ఎంతటి నమ్మకం , నిజాయితీ ఉండాలి??

తాను నమ్మిన , తన జీవితాన్ని అంకితం చేసిన భగవన్మందిరానికే తనని దూరం చేసిన పరిస్థితులు వచ్చినా,.... నిరాశ, నిస్పృహ లకు లోనుకాక  మ్రొక్కవోని ధైర్యంతో ..,తన హృదయాలయం లో  వెలసిన స్వామిని తనతోనే తెచ్చుకొని ... తాను ఉన్నచోటే తన స్వామిని ప్రతిష్టించి చూపించారంటే..... ఆ భక్తురాలికి భగవంతునితోనూ.. ఆ స్వామికి ఈ భక్తురాలితోను ఎంతటి అవినాభావ సంబంధం  ఉండి ఉండాలి???

సినిమాలలోనూ ప్రముఖ వేదికలపైనా పాడగలిగే స్థాయి నుండి ఇంట్లో పాడుకోగలిగే స్థాయి లో మాత్రమే ప్రతిభకలిగిన వివిధ స్థాయి లకు చెందిన శిష్యులు ఉన్నా ,......  అందరినీ సమానం గా  ప్రేమిస్తూ , ఎవరికి కావలసిన చెయూత వారికి అందిస్తూ .... ఎవరి ఆ స్థాయి లో ఉంటే   తానూ ఆ స్థాయి లో  ఒదిగిపోయి..  అందరికీ మాడం " నా  స్వంతం " ఆన్న భావన కలుగచేయగలుగుతున్నారంటే  ఆ గురువుకు తన ప్రతి ఒక్క శిష్యుల మీద ఎంతటి సమభావం, సహృద్భావం ఉండాలి???

అల్లరి పాటలను, సినిమా  పాటలను  ఎక్కువగా ఆస్వాదించే విద్యార్ధులకు ఆ పాటల ద్వారా కూడా  భగవంతుని దర్శించటం అలవరచి, అలవోకగా ఆధ్యాత్మికత వైపు నడిపేస్తారంటే.. ఆ గురువుకి శిష్యుల పట్ల ఎంత సహనం, నేర్పు, ఉండాలి ???

తనకోసం ఏనాడూ ఎవరినీ ఏమీ అభ్యర్ధించవలసిన అవసరం రాని వ్యక్తి, "ప్రతిభ కలిగిన తన శిష్యులకు అవకాశం కల్పించాలి" అని మాత్రం సభాముఖం గా ప్రముఖులకు విగ్న్యప్తి చేస్తున్నారంటే.....  ఆ గురువుకు తన శిష్యులపై ఎంతటి మమకారం, మాతృ ప్రేమ నిండి ఉండాలి ???

ఒక అతిసామాన్య, అత్యంత అల్ప సంగీత  గ్న్యానం ఉన్న విద్యార్ధి " నేనొక  కీర్తనను ట్యూన్ చేసాను మాడం " అని వాట్సాప్ లో  పాడి పంపిస్తే.... ఆ కీర్తనను ఓపికగా విని విశ్లేషించటమేగాక ..ఆ బాణీ ని  సరిదిద్ది  మెరుగులు అద్దటం కోసం సుదూరంలో ఉన్న ఆ విద్యార్ధి కోసం తన అమూల్య సమయం నుండి 2 గంటలు వెచ్చించి ,స్కైప్ ద్వారా మరీ ఒక్కొక్క లైన్ నూ సరిదిద్ది ప్రొత్సహిస్తారంటే .....  అస్సలు ఆ గురువు శిష్యులకు అందించే ప్రొత్సాహాన్ని ఏ మాటలలో వర్ణించాలి???

ఎంతో  దృఢ పోరాట పటిమ కలిగిన వ్యక్తిగా తన సమస్యలతో పోరాడుతూ, తన బాధ్యతలతో సతమతమౌతున్నా.. సాటిమనిషికి చిన్న  బాధ కలిగినా కదిలిపోయి, వారి సమస్యని తన సమస్యగా భావిస్తూ... వారికి మార్గ నిర్దేశకత్వం  చేస్తూ,.. తన శక్తికి మించిన  ఆర్ధిక సహాయాలు చేస్తూ.. ,తన శారీరిక శ్రమని లెక్క   చెయ్యక  వారి కొరకు ధ్యానాదికాలు చేస్తూ. సమయాభావానికీ ఖర్చుకీ వెనకాడక ప్రతిఫలమాశించని సంకీర్తనౌషధాలు అందిస్తూ... ఎవరికి  కష్టం  వచ్చినా ..కొండంత అండగా నిలుస్తూ ....    తన గురించి కూడా ఏనాడూ ఏమీ అడుగని తాను, తనను నమ్మిన వారికోసం మాత్రం అహర్నిశలూ స్వామిని అర్ధిస్తూ... ఆయననుండి ఆర్తులకు అన్నీ సాధించిపెడతారంటే ... ఆ మహా మనీషి  సున్నిత మనస్సులో ఎంతటి మానవీయత నిండి ఉండాలి ???

మా  చెల్లెలు కొడుకుకి ప్రమాదం జరిగింది మాడం  , భయం గా ఉంది " అని ఒక శిష్యురాలు రాత్రి  11 గంటలకి ఫోన్ చేస్తే.... " నువ్వు భయపడకు, నేను స్వామిని వేడుకుంటాను " అని  మాడం చెప్పాక ...  చమత్కారం జరిగినట్లు , డాక్టర్లు ఊహించినదానికి విరుధ్ధంగా ఆ పసివాడికి పెను ప్రమాదం తప్పిందని తెలిసాక.... " ఇప్పుడు రాత్రి ఒంటిగంట దాటింది..  ఈ విషయం చెప్పటం కోసం ఫొన్  చేసి మాడం కి  నిద్రాభంగం కల్గించటం  సరికాదు..రేప్రొద్దున ఫొన్  చేసి థాంక్స్ చెప్పాలి" అనుకుంటుండగా మాడం తనంతట తానే ఫొన్ చేసి , " ఇప్పటి వరకూ ఆ పిల్లవాడి కోసం ధ్యానం చేసాను.., ఇప్పుడు ఎలా ఉంది ఆ పిల్లవాడికి అని అడిగారంటే.....  అసలు..ఇలాంటి మహోన్నత వ్యక్తుల మహనీయత్వాన్ని వర్ణించటానికి .ఏ భాష వాడాలి ? ఏ భావాన్ని పొదగాలి??

తనకున్న వేలాదిమంది శిష్యులూ, అభిమానులనూ, వారి వారి కుటుంబ సభ్యులనూ.. వారి పేర్లనూ,  అతి చిన్న చిన్న వివరాలనూ తన కంప్యుటర్ లాంటి గ్న్యాపకశక్తితో గుర్తుంచుకొని ఆశ్చర్యపరచే వ్యక్తి.... తనను వంచించినవారి వంచనాగుణాన్నీ.., వారు చేసిన మోసాలనూ తప్పులను మాత్రం మరచిపోయినట్లుగా  ప్రవర్తిస్తూ... కోరితే మరల మరల వారిని చేరదీస్తూ.., నిరంతరం వారి మంచినే కాంక్షిస్తారంటే... ఆ అమాయక హృదయానికి ఎంతటి క్షమాగుణం ఉండాలి???

ఎంతో అసామాన్య ప్రతిభ, స్థాయి, కీర్తిప్రతిష్టలు, అవార్డులు ఉన్న వ్యక్తి... ఎక్కడైనా ఏదైనా హాస్యభరిత సంఘఠన ఎదురైతే మాత్రం... అన్నీ మర్చిపోయి పసిపిల్లలలాగ నిండారా నవ్వుతూ.. అందరినీ నవ్విస్తారంటే.. ఆ మనస్సు ఎంత నిష్కల్మషం గా...నిర్మలం గా ఉండాలి???

ఎన్నో వేల మంది శిష్యులకు తాను గురువైనా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి తనకు ఎన్నో ఉన్నత పురస్కారాలు లభించినా... తన గురువుల ముందు పెద్దల ముందు అతి సామాన్య వ్యక్తి లాగా వినయం గా మ్రోకరిల్లుతూ.. తన గురువుల ఆరాధనోత్సవాలు, జన్మదినోత్సవాలు నిర్వహిస్తున్నారంటే ఆ మహోన్నత శిష్యురాలికి ఎంతటి గురుభక్తి ఉండాలి?

ఇంటి బయట ఇన్నేసి విజయ నికేతనాలు ఎగురవేసినా... రచ్చ గెలిచినట్లుగానే... ఇంటిలోనూ గెలిచి చూపిస్తూ... తల్లిదండ్రులను వారు జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా చూసుకుని ,కీర్తిశేషులయ్యాక కూడా వారిని భక్తి గా  ఆరాధిస్తూ...,కుటుంబ సభ్యులందరికీ , బంధువులకీ, ఏ   మాత్రం  లోటు రాకుండా ప్రేమని అందిస్తూ.., అందరికీ తలలో నాలికలా వ్యవహరించాలంటే ఆ వ్యక్తి ఎంతటి ప్రేమైక మూర్తి అయ్యి ఉండాలి???

క్షణం తీరిక లేని షెడ్యూల్స్ , వేల మంది విద్యార్ధులు - వారి బాధ్యతలూ.., అబిమానులూ, తన భుజస్కంధాల పైన మోసి  ముందుకు తీసుకు వెళ్ళాల్సిన సంస్థ నిర్వహణా భారం, కుటుంబ బాధ్యతలూ...ఇలా ఎన్నో అంశాలతో సతమతమౌతున్నా కూడా సమకాలీన ప్రపంచంలో జరిగే సామాజిక, రాజకీయ, క్రీడా,  చలనచిత్ర  అంశాలన్నిటికీ తగు రీతిలో స్పందిస్తూ.., వాటికి తన ఆధ్యాత్మిక ,మానవీయ  కోణాలని  జోడిస్తూ శిష్యులకూ , అనుయాయులకూ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మానవత్వపు విలువలనూ..., ఆధ్యాత్మికతనూ బొధిస్తున్నారంటే ....ఆ ఉన్నత వ్యక్తి కి ఎంతటి సామాజిక స్పృహ , ఆధునిక శాస్త్ర పరిగ్న్యానం  కూడా ఉండి  ఉండాలి ???

ఇంత మందికీ ఇన్ని రకాలుగా అనుబంధాన్నీ, ఆత్మీయతనూ పంచి ఇస్తున్నా... తన మనస్సులో మాత్రం చెరుగని భగవద్రూపాన్ని ప్రతిష్టించుకొని ,..... ఆయననే ధ్యానిస్తూ,  .... ఆ స్వామినే కీర్తిస్తూ....,  భగవద్భావనలతో  నిరంతరం రమిస్తూ... భగవత్తత్వాన్ని  నిరంతరం బోధిస్తూ... తానే కదిలే భగవద్రూపం గా భాసిస్తూ.. మమ్మల్నందరినీ భగవన్మార్గంలోకి చేయిపట్టి నడిపిస్తున్నారంటే... ఆ మానవ మూర్తి లొవె ఎంతటి దైవత్వం నిండి ఉండాలి ???

ఇన్ని విశేష గుణాలూ .... వివిధ వ్యక్తులలో పంచబడినవి కావు, అన్నీ మూర్తీభవించి మా గురువు గారి రూపం లో వెలిశాయి.. అసలు అటువంటి గురువు దర్శన భాగ్యం దొరకడమే అపూర్వం.. అలాంటిది .. ఆ గురువుకి శిష్యులవడానికి మాకున్న అర్హత ఏమిటో.... ఏ  జన్మలో చేసుకున్న    సుకృతఫలమో... మాకెవరికీ అర్ధం కాదు..

ఇవన్నీ నాకు తెలిసిన అతి కొద్ది విషయాలు...,
 అయినా వ్రాసినక్రొద్దీ అనంతం గల స్ఫురిస్తున్నాయి.
ఒక మహా సముద్రం ఒడ్దున నిలబడి చూస్తే..  ఆ సముద్రాన్ని కొంతమేరకే చూడగలుగుతాము.
 అంతమేరకే ఆ సముద్రపు లోతునీ , హొయలనీ , అలలనీ చూడగలుగుతాము..
ఆంతే...  అలాగే..మా గురువనే మహా సాగరపు ఒడ్డున నిలబడ్డ అతి మామూలు  శిష్య సైకతరేణువును నేను...
అంతమేరకే నా అనుభవం...
 నిజానికి నా అనుభవాలన్నీ.. సముద్రపు ఒడ్దుకి వచ్చే చిన్న చిన్న అలలు, వాటి తో పాటు కొట్టుకువచ్చే గవ్వలలాంటివి.
 కానీ నా ఉద్దెశ్యం ప్రకారం ఈ మహా మనీషి ఒక నడిచే గ్న్యాన సాగరం .
ఆ సముద్రపు లొతు అనూహ్యం .
 ఆ సముద్రగర్భం లో ప్రేమ, అనురాగం,  విగ్న్యానం, ఆధ్యాత్మికత, భక్తి వంటి అమూల్య రత్నాలు అనంతం.
సముద్రపు గర్భంలోకి వెళ్లినక్రొద్దీ ..రత్నాలు రాసులుగా లభించినట్లే... మా గురు జలధి లోపలికి వెల్లిన క్రొద్దీ మాకు ఎన్నెన్నో గ్న్యాన రత్నాలు లభిస్తాయి.
సాధారణం గా సముద్రం లొప్లికి లోతు గా వెళ్లాలంటే ..ఎంతో కష్టతరమైన శిక్స్షణ, , సాధన కావాలి .
కాని మన  గురువు గారికి దగ్గరగా వెళ్లడం మాత్రం చాలా సులభం. దానికి ఒక్కటే మార్గం..
కాలుష్య రహిత సాధన.
సాటి మనుష్యులపైనా, సంగీతం లోనూ, సాహిత్యంలొనూ, భక్తిలోనూ... అన్ని రంగాలలోనూ...అన్ని దిశలలోనూ... భావకాలుష్య రహిత..సాధన..
అదే మనం మన అపార గురు కృపను పొందడానికి అవలంబించవలసిన సాధనా మార్గం.
అదే మన గురువు బొధించిన మంత్రం...
మనలోని భావకాలుష్యాన్ని  పారద్రొలి, భక్తి సంగీతం ద్వారా సమాజానికి మార్గదర్శకులమై, మన గురువు గారి ఆశయ సాధనకి తోడ్పడటానికై ...,
ఈ అంకితభావదినోత్సవమ్నాడు ప్రతినపూనుతూ...
మన గురువు, మాతృమూర్తి,  శ్రీమతి శోభారాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం.

11, ఫిబ్రవరి 2012, శనివారం

' నిన్నే నెర నమ్మినానురా '





ఏడవట్లేదు స్వామీ ...
ఏడవను నేను,
ఏమైంది ఇప్పుడు?
మరోసారి వైఫల్యానికి విలాసమయ్యను,
ఇంకోసారి నిరాశకు నీడనిచ్చాను...,
అంతేగా....
అయితే ఏమి?
నువ్వు లేవూ....
'హరాయించుకోలేని సమయంలో అమృతమడిగినా ఇవ్వవు,
అవసరమైన సమయంలో విరుగుడు శక్తి ఇచ్చి మరీ విషప్రభావం నుండి రక్షిస్తావు ,'
అని.. నీ మీద నాకు నమ్మకం.
మరి ఏడిస్తే ఏమి లాభం?
నీ నిర్ణయాన్ని నిరసించటమేగా..
నా అసంతృప్తిని ప్రకటించమేగా..
నా నమ్మకాన్ని సడలించుకోవటమేగా..
నా ఓటమిని ఒప్పుకోవడమేగా..
లేదు లేదు...నేను ఏడవటంలేదు.

"సాక్షిగా నిలిచి నీ పాపపుణ్యాలు బేరీజువేసి,
నీకొచ్చేది ఇస్తా తప్ప నాకేమీ సంబంధం లేదు అంటున్నావేమో"..
సరే మరి, నా పుణ్యాల తక్కెడ బరువెక్కేందుకు ప్రయత్నిస్తా.
నీ నామ కీర్తనకంటే దారేది దానికి?
మరి నీ నామకీర్తన లో పరవశిస్తే
ఇంకెక్కడుంటాయి కన్నీరు?
కారినా అవి ఆనందాశృధారలేగానీ..


"తెలియదా నీకు?  భక్తవత్సలుడు ఆయన!,
ఆర్తితో కన్నీరైతే...కరిగి వరాలిస్తాడు"అంటున్నారు..
అవును, ఎన్నిసార్లు ఇవ్వలేదు నువ్వు నాకా అనుభవం?!!
ఇప్పటికి ఎన్నిసార్లు కడగలేదు కొరిక తీరని బాధతో నీ పాదాలను నా కన్నీరు?
కానీ ఇప్పుడు మాత్రం నేను ఏడవను.
అయినా...,
నా కనులు కరుగకున్నా ..
నీకు వినపడనిదా నా హృదయ రోదన?
నీకు తెలియనదా నా ఆత్మ వేదన?
ఇంకెందుకు ఏడవటం?

కన్నీరు మున్నీరై నీరసిస్తే నీ నామస్మరణం చేయడమెట్లా?
శోకండాలతో గళం గద్గదమైతే నీ దివ్య కీర్తనం పాడటమెట్లా?
అందుకే నేను ఏడవను.

ఎక్కడో చదివాను...
కొన్నిసార్లు అడగగానే అందిస్తావట,
వద్దన్నావంటే ఇంకా మంచిదేదో ఇస్తావుట,
ఆగమని అన్నవంటే ఇహ అత్యుత్తమమైనదే ప్రసాదిస్తావుట.
అంతే అయ్యుంటుంది..
లేకపోతే ధర్మబధ్ధమైన నా చిన్న కోరిక
తీర్చడం నీకు కష్టమా?
ఏమి హంగులు దిద్దుతున్నావో నా కోరికల పేటలకి!!,
ఏమి రత్నాలు పొదుగుతున్నవో నా వరాలమూటలకి!!
నేనేమి ఊహించగలను?
నా పరిధి ఎంత?

ఒక్కటే ధైర్యం!! అడగరానిది అడగట్లేదు,
ఒక్కటే నిబ్బరం!! అశక్తులని యాచించటంలేదు.
ఇంకెందుకు శోకం??
నాకెందుకు దైన్యం??

అయినా నాకేమి తక్కువ??
కష్తాలలో నాకు దారి చూపటానికి,
బలహీనపడ్దప్పుడు భక్తి నిలపటానికీ,
ఆన్నమయ్య కీర్తనలు లేవా?
త్యాగరాజ కృతులు లేవా??
పొతన పద్యాలు లేవా?
దీవించే గురువులు లేరా?
నీవిచ్చిన గొంతు లేదా?

అందుకే వస్తున్నా..
శబరి ఓర్పే ఆదర్శం గా..
ఉడుత ప్రేమే దిశానిర్దేశకం గా
విభీషణుడి కి శరణిచ్చిన నీ పాదాల చెంతకు,
ద్రౌపది ని ఆదుకున్న ఆ అభయహస్తాల నీడకు,
ఎందరో మహనుభావులు నమ్ముకున్న మీ నెలవునకు..

23, జనవరి 2012, సోమవారం

ఎటు చూసినా ఎంట్రన్స్ ల సంరంభం - విద్యార్ధుల భావి జీవితానికి అదే శుభారంభం

'చందాలిచ్చే వారినే అందలమెక్కించే' ధనదాసులను దారిమళ్ళించి,
పేదరికపు కారుమేఘాలు కమ్మిన జీవితాలలో విద్యా శరశ్చంద్రికలు చిందించి,
ప్రతిభకు ప్రాముఖ్యతనిచ్చే ప్రవేశ పరీక్షలు వచ్చేశాయనీ..
చదువుల తల్లిని కూడా భాగ్యవంతుని బానిసగా భావించే రోజులు గతించి,
ప్రతిభావంతునికి ప్రపంచమంతా ప్రణమిల్లే రోజులు ఏతెంచాయనీ..
భావిభారత భాగ్య మందిరానికి అదే పునాది అనీ..
భావించిన భరతమాత ఆనాడు ఆనంద డోలికలలో అలరారింది.

కానీ...

ఏ ఎంట్రన్స్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
పరీక్షల పధ్ధతి సమస్తం అవినీతి పరాయణత్వం" అనిపించే రీతిలో
జవాబులు తప్పు రాసే విధ్యార్ధులకు పోటీగా
అధికారులు అందించే అనర్ధ స్వకపోల కల్పనాభరిత ప్రశ్నాపత్రాల వల్ల
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమై నిలుస్తుంటే ...

అన్నిటా ఆరునెలల ఆలస్యాన్ని అవలంబించే అధికారపుంగవులు
ప్రశ్నా పత్రాలను మాత్రం పాపిష్ఠిసొమ్ము కోసం పది రోజుల ముందే పరగతం చేసి,
చిత్తశుధ్ధితో చదివే చిన్నారుల ఆశలను చిదిమి వేస్తుంటే..

అమాయక విధ్యార్ధుల ఆశయాల ఆసరాలను అవినీతిపరులు అంతమొందిస్తుంటే..,
భావిభారత సుందర సౌధానికి బంగారు బాటలు వేసే విద్యార్ధుల
పసిడికలల ప్రాకారాలన్నీ పేకమేడలలా కూలిపోతుంటే..
పాపపంకిల పూరిత ప్రవేశ పరీక్షల ఊబిలో చిక్కుకొని ,
అన్యాయంగా అధోగతికి నెట్టబడిన అమాయకులు విడిచే అశృవుల సుడిగుండాలలో పడి
నేడు భరతమాత మునిగిపోనున్నది.

అందుకే ..

ఏనాడు జాతిహితయుక్త ప్రవేశ పరీక్షలలో చెడుగుని చెరగివేయగలమో..,
ఏనాడు కాగితంపులులవంటి నామమాత్ర ప్రవేశ పరీక్షలు
భీకరబొబ్బులులై అన్యాయాన్ని, అసమర్ధతను అణచివేసి ప్రతిభకు పట్టం కట్టగలవో,
ఏనాడు విద్యావంతులు అవినీతిపరులపై విప్లవశంఖం పూరించి విజయపథం లో పయనించగలరో..,

ఆనాడు ..
ఎటు చూసినా ఉండే ఎంట్రన్స్ ల సంరంభం
విద్యార్ధుల భావిజీవితానికి శుభారంభం
అదే..
భరతవర్ష బంగారు భవితకు
హర్ష భరిత శుభారంభం.

17, జనవరి 2012, మంగళవారం

ఒక హౌస్ సర్జన్ మనోవేదన

చిగురించకనే వసివాడిన లేతకొమ్మా!
పాడ్యమి నాడే రాహువు మింగిన చందమామా!


నీ లేలేత గళం నుండి ఏ గానకోకిల ఉద్భవించి,
కమనీయ రాగాలతో ఈ అవనిపై అమృతవర్షం కురిపించేదో....?

నిర్లక్ష్య వైఖరితో, నిరంకుశ కర్కశ పాదాలతో
నీ కంఠం కమిలిపోయేలా కసిగా కాలరాశారు.


నీ మనొగగనం లో ఏ కవికోకిల జనియించి,
అమృత తుల్య రచనలతో పుడమిని పులకరింప చేసేదో.....?


దుర్భేద్య పరిస్థితుల దుర్భర అగాధంలో పడవేసి,
నిరుపేదవన్న నిరాదరణ జ్వాలల్లో త్రోసివేసి,
నీ పుర్రెను పూడ్చివేసారు,
నీ మస్తిష్కాన్ని మసి చేసారు.


తెరువకనే మూసిన ఆ కన్నులనుండి
విశ్వ ప్రేమను చాటే ఏ విశ్వమాత
కారుణ్య భరిత దృక్కులు వెల్లి విరిసేవో.....?

మానవత్వాన్ని మంటగలిపి,
కారుణ్యాన్ని కాల్చివేసి,
ప్రేమను పరిసమాప్తం చేసారు.
అందరి అనాదరణకు నిన్ను ఆహుతి చేసారు.


పురిటిలోనే పుణ్యలోకాలకు చేరిన పుత్తడి బొమ్మా!

కౄరమృగాల మధ్య చిక్కిన లేడిపిల్లలా ..
భయం భయం గా శ్వాసిస్తున్న నీకు,
నా ఊపిరి పంచాలని పలువిధాల ప్రయత్నించానమ్మా..

పుట్టకముందే అనేక అసహాయతలతో అలసిపోయి,
గునపాలు గ్రుచ్చబడ్డ నీ గుండెను
స్పందింప చేయాలని శతధా శ్రమించానమ్మా..

నిన్ను ఏడ్పించి, నీ తల్లిని నవ్వించాలన్న తపనతో ..
నీ పసి దేహాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టానమ్మా..


కానీ......

పాడు బ్రతుకు బ్రతకటం కోసం నిరంతరం మనసుని చంపుకుంటూ..
అనుక్షణం చస్తూ బ్రతికే మీరు ఏడవాలిగానీ నేనెందుకు ఏడ్వటం అనుకున్నావేమో...

పైసల కోసం శిశువుల అశువులు సైతం లెక్క చేయని పశువులున్న
పాపిష్ఠి లోకాన్ని పరిహసిస్తూ పుణ్యలోకాలకు పయనించావు.

జాలిగలవారిపై కూడా జులుం చేసే అధికారుల రాజ్యంలో ,
అసహాయురాలినైన నేను మాత్రం ,
నీ మరణాన్ని ధృవీకరించడం తప్ప మారు మాటాడలేకపోయాను.


గర్భకుహరం నుండే అంతిమ గమ్యం చేరిన చిట్టితల్లీ!

అందరిలాగే తానూ నిన్ను అసహాయంగా వదిలి,
అమ్మ అమృతం అందకుండా అడ్డుపడి,
భగవంతుడు నీకు శాపమే ఇచ్చాడో..?

లేక

కర్కొటకులై క్షణ క్షణం కాలకూటం చిందించే
కర్కశ నాగుల వంటి కౄర మానవుల కబంధహస్తాలనుండి కాపాడి,
కరుణతో తన కడకు చేర్చుకొని,
నీకు కమ్మని వరమే ప్రసాదించాడో..?
ఆ భగవంతుడినే అడుగమ్మా.


పసిపాపకు పాలిస్తానన్న పసిడి కలలతో
ప్రసవ వేదన పడ్డ పిచ్చి తల్లి మరణతుల్య వేదనకు
సార్ధకత్వం చేకూర్చమని చెతులెత్తి ప్రార్ధించినా..
దూరంగా ఉన్నానని నా ప్రార్ధనను పట్టించుకోలేదేమో..?
ఎందుకిలా జరిగిందని
నిన్ను తనలో ఐక్యం చేసుకున్న ఆ భగవంతుని నువ్వైనా నిలదీయమ్మా..


పాపపుణ్యాలెరుగని పసిపాపల గర్భస్థవేదనను
దురంతం చేసే దురాశాపరుల దుష్టత్వాన్నీ,

ప్రత్యక్ష దైవాలైన కన్న తల్లుల ప్రసవవేదనను
నిరర్ధకం చేసే నిర్దయుల నిర్లక్ష్యాన్నీ,

మానవత్వంతో స్పందించే నావంటి వారి మనో వేదనను
అపహాస్యం చేసే అమానుష హృదయుల ఆభిజాత్యాన్నీ..
అంతం చేయమని
ఆ అంతర్యామిని నీవైనా అర్ధించమ్మా...

10, జనవరి 2012, మంగళవారం

గీటురాయి

నా గురువు నన్ను 'విధేయతగల విద్యార్ధి ' అని ప్రశంసిస్తే..,
నా పై అధికారి 'ఎంతో నమ్మకమైన వ్యక్తి ' అని నన్ను అభినందిస్తే..,
నా ఇరుగుపొరుగువారు నన్ను 'ఎంతో స్నేహపూరిత మనస్కురాలు ' అని పొగిడితే..,
నా కూతురి అత్తమామలు 'మర్యాద తెలిసిన మనిషి ' అని నన్ను అభిమానిస్తే..,
నా అల్లుడు 'మా అత్తగారికి నేనంటే ఎంతో అభిమానం' అని ఆనందపడితే..,

నేను ఏదో పెద్ద మంచిదాన్నని అర్ధం కాదు,
నేను చెడ్డదాన్ని కాదనే అర్ధం అస్సలుకే రాదు.
ఖచ్చితంగా చెప్పాలంటే 'లౌక్యం తెలిసిన మనిషి ' మాత్రమే అవుతా.!!!!

నా శిష్యులు తెలివితక్కువగా అడిగే చిన్న చిన్న సందేహాలను కూడా ఓపికగ సమాధానం చెప్పి,వారి అభివృధ్ధికై తపన పడగలిగితే...,
నా ఇంట్లో పనిమనిషుల కష్టసుఖాలు అర్ధం చేసుకొని వాళ్ళని మనుషులుగా
చూడగలిగితే...,
నా కంటే పేదవారికి మనస్ఫూర్థిగా చేతనైన సహాయం చేయగలిగితే,
నా కొడుకు అత్తమామలు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని కూడా 'అతిధి దేవొభవ ' అని గౌరవించగలిగితే..
నా కోడలికి కూడా అల్లుడికి ఇచ్చిన ఫ్రేమ,అభిమానం,విలువ ఇవ్వగలిగితే....

"నేను సాధించినదంతా మా గురువు పెట్టిన భిక్ష" అని ఎదిగిన శిష్యులు నిన్ను తలుచుకొన్ననాడు,
"మా అమ్మగారు సానా దయగల తల్లి" అని నా పనిమనిషి తో అనిపించుకో గలిగిననాడు,
"దేవుడు నిన్ను చల్లగా చూడాలి" అనే ఒక పేద హృదయపు స్వచ్చమైన దీవెనలు పొందగలిగిననాడు,
"ఎంతో పుణ్యం చేసుకుని మా కూతురు మిమ్మల్ని అత్తగా పొందింది " అని నా వియ్యపురాలితో అనిపించుకోగలిగిననాడు,
"మీరు ఇంట్లో లేకపోతే మాకు బాగోదు అత్తయ్యా, ఊరి నుంచి త్వరగా వచ్చేయండి" అని నా కోడలు నాతో అన్ననాడు,ఆ భావం ఆమె కళ్ళలో స్పష్టం గా చూడగలిగిననాడు...

అప్పుడే నేను నిజంగా మంచిదాన్నని అర్ధం.

ఎందుకంటే...
సమాజం, సాంప్రదాయం, అంతస్థు, అవసరాల పరంగా నాకంటే పై అంతస్థులో ఉన్నవారితో, నా సాటివారితో మంచి అనిపించుకునేట్లు ప్రవర్తించకపోతే...,

నన్నొక్క తన్ను తన్నటం, నన్ను దూరంగా తొయ్యెటం 'వాళ్ళకొక్క క్షణం పని ' అని తెలిసిన
లౌక్యపు మంచితనం మంచితనానికి గీటురాయి కానేకాదు.

నాకంటే తక్కువ అని సమాజం, సాంప్రదాయాలు నిర్దేశించినవారితో..

"నాతో వారికి తప్ప వారితో నాకు అవసరం లేదు అని " నేను భ్రమించే వారితో సహృదయంతో మెలగగలగటమే..

నా మంచితనానికి కొలమానిక..
అదే.. మనిషిలోని దైవత్వానికి తొలిదీపిక

24, మార్చి 2009, మంగళవారం

వర్తమానాన్ని వృధా కానీకు

గతం గుర్తుకు వస్తే గళం గద్గదమౌతుది,
భవిష్యత్తును ఊహిస్తే హృదయం భారమౌతుంది.
గతంలోని గాయాలను మాపనూలేము,
భవిష్యత్తులొని బాధలను ఆపనూలేము
.గతకాలపు గంధాలు తిరిగి గుబాళించాలని ఆశించనూలేము,
భవిష్యత్తంతా సుమవల్లికయై పరిమళించాలని శాసించనూలేము.
కనుక.....
గతించిన మనోహర వసంత సాంగత్యాన్ని నీ సాటి విహారులందరిలా నీవూ మరచిపో!
మరుసటి వసంతం మరింత శొభావంతమై నిరంతరం నిను మురిపించేందుకు ఒకింత ముందుందు.
గతంలో గ్రుచుకున్న ముళ్ళ మార్గాన్ని ముందుగా గుర్తించి ,భవిష్యత్తులో అవి మరల బాధించకుండా బాధ్యత వహించు.
క్షణం క్రితం నిన్ను ఊహలలో ఊరించి ,
మరో క్షణంలో నిన్నువెక్కిరిస్తూ వుడాయించే..
వర్తమానాన్ని వశపర్చుకో.
గతాన్ని ఙ్ఞాపకాలల్లో ఇముడ్చుకొని,
భవిష్యత్తుని ఊహలలో అమర్చుకొని,
వర్తమానాన్ని రమ్యంగా అలంకరించుకో.
అంతేకానీ..,
గతస్మృతుల సుడిగుండాలలో చిక్కుకుపోతూ ,
భవిష్యత్తు కై నిర్మించే పగటి కలల హర్మ్యాల మధ్య శిధిలమౌతూ,
నిన్నటి భవిష్యత్తునీ, రేపటి గతాన్నీ శాసించగల
వర్తమానాన్ని వృధా కానీకు

ప్రపంచం ఒక పద్మవ్యూహం - కవిత్వం ఒక తీరని దాహం

"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న రాయల వాక్కు మదిలో స్ఫురణకు రాగా...
నేను తెలుగు గడ్డ పై పుట్టానన్న గర్వం మనసు లో మధుర భావాలు రేపగా..
భాష అనే సువర్ణాన్ని భావమనే సుగంధ పరిమళం తో గుబాళింప చేయాలనీ..
తేనెలొలుకు తెలుగు మాటల ముత్యాల పేటలతో కవితా హారాన్ని మలచాలనీ..
ప్రపంచం లోని ప్రతి అంశంలోని ఆనందాన్నీ ,
ప్రకృతి లోని అణువు లోని అందాన్ని ఆస్వాదించి..
మానసవీణను మధుర దృశ్యాలతో శృతి చేసి..,
హృదయ తంత్రిని హృద్య ప్రేరణలతో స్వరపరచి..
జలపాతంలా జాలువారి ఉరకలు తీసె నా భావామృతంతో
నాలో నిరంతరం చెలరేగే కవితా దాహాన్ని చల్లార్చాలని కలం తీశాను.

తిరిగిరాని తీయని కలవంటి బాల్యం పేదరికపు జ్వాలలో కరిగిపోతుంటే..
పిడికెడు మెతుకుల కోసం తమ రెక్కలతో పాటుగా రేపటినీ ముక్కలు చేసుకుంటున్న
బాలకార్మికులను చూసి నా హృదయం బాధావృతమైనది.

ఎగసిపడే కెరటం లాంటి యవ్వనం కదం త్రొక్కుతున్నా...
జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించటానికి పరుగు ప్రారంభించవలసిన వయసులో
దుర్వ్యసనాల మత్తులో,అర్ధం లేని ప్రేమ మైకంలో,విదేశీ వెర్రి సంస్కృతుల మోహంలో పడి ,
ఆత్మవిశ్వాసాన్నీ, మనోధైర్యాన్నీ, జీవిత లక్ష్యాన్నీ కొల్పోయి,
నిరాశా నిస్పృహలతో నిస్సత్తువగా తప్పటడుగులు వేసే యువతను చూసి..
నా మనోవీణ అపశృతులు పలికింది.

మానవత్వాన్ని మించిన మతం, కరుణను మించిన కులం లేనేలేదని ప్రతీ పవిత్రగ్రంధం ఘోషిస్తూనేఉన్న,
కులమతబేధాల ఘర్షణలలో సాటివారి రక్తంతో పుడమిని తడిపే మతోన్మాదులనూ ,
ఒకే సరిహద్దు రేఖకు చెరొకవైపు ఉన్న కారణంగా ...
మానవతను మరచి పొరుగు దేశంలో ఉత్పాతాలూ, ఉగ్రవాదాలు సృష్టించి
పైశాచిక ఆనందం అనుభవించే రాక్షసులను చూసి ..,
నా చేయి కంపించింది.

లింగవివక్షతకు గురై, భౄణహత్యలకు బలౌతున్న శిశువులనూ,
అధికారం కోసమని విఙ్ఞానాన్ని వినాశనానికై వినియోగించే అగ్రదేశాధినేతలనూ,
వరకట్నచావులకూ,అత్యాచారాలకూ లోనవుతున్న అతివలనూ,
దేశానికి నేనేమి చేశానని అలోచించక "దేశం నాకేమి చేసింది"అన్న స్వార్ధంతో విదేశాలకు అమ్ముడు పోయే మేధావులనూ చూసి,
నా భావావేశం చల్లారిపొయి నా చేతిలోని కలం జారిపోయింది.

అందుకే..!
మానవత వున్న ఏ హృదయమూ ఈ ప్రపంచ పద్మవ్యూహంలోకి అడుగిడి
ఎంత తీయని భాషలోనూ కవితలు వ్రాయలేదనీ,
తన కవితా దాహం తీర్చుకోలేదనీ..
తల్లడిల్లే నా మనసును ఊరడించక తప్పలేదు.