నా బ్లాగు లిస్ట్‌

24, మార్చి 2009, మంగళవారం

ప్రపంచం ఒక పద్మవ్యూహం - కవిత్వం ఒక తీరని దాహం

"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న రాయల వాక్కు మదిలో స్ఫురణకు రాగా...
నేను తెలుగు గడ్డ పై పుట్టానన్న గర్వం మనసు లో మధుర భావాలు రేపగా..
భాష అనే సువర్ణాన్ని భావమనే సుగంధ పరిమళం తో గుబాళింప చేయాలనీ..
తేనెలొలుకు తెలుగు మాటల ముత్యాల పేటలతో కవితా హారాన్ని మలచాలనీ..
ప్రపంచం లోని ప్రతి అంశంలోని ఆనందాన్నీ ,
ప్రకృతి లోని అణువు లోని అందాన్ని ఆస్వాదించి..
మానసవీణను మధుర దృశ్యాలతో శృతి చేసి..,
హృదయ తంత్రిని హృద్య ప్రేరణలతో స్వరపరచి..
జలపాతంలా జాలువారి ఉరకలు తీసె నా భావామృతంతో
నాలో నిరంతరం చెలరేగే కవితా దాహాన్ని చల్లార్చాలని కలం తీశాను.

తిరిగిరాని తీయని కలవంటి బాల్యం పేదరికపు జ్వాలలో కరిగిపోతుంటే..
పిడికెడు మెతుకుల కోసం తమ రెక్కలతో పాటుగా రేపటినీ ముక్కలు చేసుకుంటున్న
బాలకార్మికులను చూసి నా హృదయం బాధావృతమైనది.

ఎగసిపడే కెరటం లాంటి యవ్వనం కదం త్రొక్కుతున్నా...
జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించటానికి పరుగు ప్రారంభించవలసిన వయసులో
దుర్వ్యసనాల మత్తులో,అర్ధం లేని ప్రేమ మైకంలో,విదేశీ వెర్రి సంస్కృతుల మోహంలో పడి ,
ఆత్మవిశ్వాసాన్నీ, మనోధైర్యాన్నీ, జీవిత లక్ష్యాన్నీ కొల్పోయి,
నిరాశా నిస్పృహలతో నిస్సత్తువగా తప్పటడుగులు వేసే యువతను చూసి..
నా మనోవీణ అపశృతులు పలికింది.

మానవత్వాన్ని మించిన మతం, కరుణను మించిన కులం లేనేలేదని ప్రతీ పవిత్రగ్రంధం ఘోషిస్తూనేఉన్న,
కులమతబేధాల ఘర్షణలలో సాటివారి రక్తంతో పుడమిని తడిపే మతోన్మాదులనూ ,
ఒకే సరిహద్దు రేఖకు చెరొకవైపు ఉన్న కారణంగా ...
మానవతను మరచి పొరుగు దేశంలో ఉత్పాతాలూ, ఉగ్రవాదాలు సృష్టించి
పైశాచిక ఆనందం అనుభవించే రాక్షసులను చూసి ..,
నా చేయి కంపించింది.

లింగవివక్షతకు గురై, భౄణహత్యలకు బలౌతున్న శిశువులనూ,
అధికారం కోసమని విఙ్ఞానాన్ని వినాశనానికై వినియోగించే అగ్రదేశాధినేతలనూ,
వరకట్నచావులకూ,అత్యాచారాలకూ లోనవుతున్న అతివలనూ,
దేశానికి నేనేమి చేశానని అలోచించక "దేశం నాకేమి చేసింది"అన్న స్వార్ధంతో విదేశాలకు అమ్ముడు పోయే మేధావులనూ చూసి,
నా భావావేశం చల్లారిపొయి నా చేతిలోని కలం జారిపోయింది.

అందుకే..!
మానవత వున్న ఏ హృదయమూ ఈ ప్రపంచ పద్మవ్యూహంలోకి అడుగిడి
ఎంత తీయని భాషలోనూ కవితలు వ్రాయలేదనీ,
తన కవితా దాహం తీర్చుకోలేదనీ..
తల్లడిల్లే నా మనసును ఊరడించక తప్పలేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి