నా బ్లాగు లిస్ట్‌

11, ఫిబ్రవరి 2012, శనివారం

' నిన్నే నెర నమ్మినానురా '





ఏడవట్లేదు స్వామీ ...
ఏడవను నేను,
ఏమైంది ఇప్పుడు?
మరోసారి వైఫల్యానికి విలాసమయ్యను,
ఇంకోసారి నిరాశకు నీడనిచ్చాను...,
అంతేగా....
అయితే ఏమి?
నువ్వు లేవూ....
'హరాయించుకోలేని సమయంలో అమృతమడిగినా ఇవ్వవు,
అవసరమైన సమయంలో విరుగుడు శక్తి ఇచ్చి మరీ విషప్రభావం నుండి రక్షిస్తావు ,'
అని.. నీ మీద నాకు నమ్మకం.
మరి ఏడిస్తే ఏమి లాభం?
నీ నిర్ణయాన్ని నిరసించటమేగా..
నా అసంతృప్తిని ప్రకటించమేగా..
నా నమ్మకాన్ని సడలించుకోవటమేగా..
నా ఓటమిని ఒప్పుకోవడమేగా..
లేదు లేదు...నేను ఏడవటంలేదు.

"సాక్షిగా నిలిచి నీ పాపపుణ్యాలు బేరీజువేసి,
నీకొచ్చేది ఇస్తా తప్ప నాకేమీ సంబంధం లేదు అంటున్నావేమో"..
సరే మరి, నా పుణ్యాల తక్కెడ బరువెక్కేందుకు ప్రయత్నిస్తా.
నీ నామ కీర్తనకంటే దారేది దానికి?
మరి నీ నామకీర్తన లో పరవశిస్తే
ఇంకెక్కడుంటాయి కన్నీరు?
కారినా అవి ఆనందాశృధారలేగానీ..


"తెలియదా నీకు?  భక్తవత్సలుడు ఆయన!,
ఆర్తితో కన్నీరైతే...కరిగి వరాలిస్తాడు"అంటున్నారు..
అవును, ఎన్నిసార్లు ఇవ్వలేదు నువ్వు నాకా అనుభవం?!!
ఇప్పటికి ఎన్నిసార్లు కడగలేదు కొరిక తీరని బాధతో నీ పాదాలను నా కన్నీరు?
కానీ ఇప్పుడు మాత్రం నేను ఏడవను.
అయినా...,
నా కనులు కరుగకున్నా ..
నీకు వినపడనిదా నా హృదయ రోదన?
నీకు తెలియనదా నా ఆత్మ వేదన?
ఇంకెందుకు ఏడవటం?

కన్నీరు మున్నీరై నీరసిస్తే నీ నామస్మరణం చేయడమెట్లా?
శోకండాలతో గళం గద్గదమైతే నీ దివ్య కీర్తనం పాడటమెట్లా?
అందుకే నేను ఏడవను.

ఎక్కడో చదివాను...
కొన్నిసార్లు అడగగానే అందిస్తావట,
వద్దన్నావంటే ఇంకా మంచిదేదో ఇస్తావుట,
ఆగమని అన్నవంటే ఇహ అత్యుత్తమమైనదే ప్రసాదిస్తావుట.
అంతే అయ్యుంటుంది..
లేకపోతే ధర్మబధ్ధమైన నా చిన్న కోరిక
తీర్చడం నీకు కష్టమా?
ఏమి హంగులు దిద్దుతున్నావో నా కోరికల పేటలకి!!,
ఏమి రత్నాలు పొదుగుతున్నవో నా వరాలమూటలకి!!
నేనేమి ఊహించగలను?
నా పరిధి ఎంత?

ఒక్కటే ధైర్యం!! అడగరానిది అడగట్లేదు,
ఒక్కటే నిబ్బరం!! అశక్తులని యాచించటంలేదు.
ఇంకెందుకు శోకం??
నాకెందుకు దైన్యం??

అయినా నాకేమి తక్కువ??
కష్తాలలో నాకు దారి చూపటానికి,
బలహీనపడ్దప్పుడు భక్తి నిలపటానికీ,
ఆన్నమయ్య కీర్తనలు లేవా?
త్యాగరాజ కృతులు లేవా??
పొతన పద్యాలు లేవా?
దీవించే గురువులు లేరా?
నీవిచ్చిన గొంతు లేదా?

అందుకే వస్తున్నా..
శబరి ఓర్పే ఆదర్శం గా..
ఉడుత ప్రేమే దిశానిర్దేశకం గా
విభీషణుడి కి శరణిచ్చిన నీ పాదాల చెంతకు,
ద్రౌపది ని ఆదుకున్న ఆ అభయహస్తాల నీడకు,
ఎందరో మహనుభావులు నమ్ముకున్న మీ నెలవునకు..

23, జనవరి 2012, సోమవారం

ఎటు చూసినా ఎంట్రన్స్ ల సంరంభం - విద్యార్ధుల భావి జీవితానికి అదే శుభారంభం

'చందాలిచ్చే వారినే అందలమెక్కించే' ధనదాసులను దారిమళ్ళించి,
పేదరికపు కారుమేఘాలు కమ్మిన జీవితాలలో విద్యా శరశ్చంద్రికలు చిందించి,
ప్రతిభకు ప్రాముఖ్యతనిచ్చే ప్రవేశ పరీక్షలు వచ్చేశాయనీ..
చదువుల తల్లిని కూడా భాగ్యవంతుని బానిసగా భావించే రోజులు గతించి,
ప్రతిభావంతునికి ప్రపంచమంతా ప్రణమిల్లే రోజులు ఏతెంచాయనీ..
భావిభారత భాగ్య మందిరానికి అదే పునాది అనీ..
భావించిన భరతమాత ఆనాడు ఆనంద డోలికలలో అలరారింది.

కానీ...

ఏ ఎంట్రన్స్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?
పరీక్షల పధ్ధతి సమస్తం అవినీతి పరాయణత్వం" అనిపించే రీతిలో
జవాబులు తప్పు రాసే విధ్యార్ధులకు పోటీగా
అధికారులు అందించే అనర్ధ స్వకపోల కల్పనాభరిత ప్రశ్నాపత్రాల వల్ల
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమై నిలుస్తుంటే ...

అన్నిటా ఆరునెలల ఆలస్యాన్ని అవలంబించే అధికారపుంగవులు
ప్రశ్నా పత్రాలను మాత్రం పాపిష్ఠిసొమ్ము కోసం పది రోజుల ముందే పరగతం చేసి,
చిత్తశుధ్ధితో చదివే చిన్నారుల ఆశలను చిదిమి వేస్తుంటే..

అమాయక విధ్యార్ధుల ఆశయాల ఆసరాలను అవినీతిపరులు అంతమొందిస్తుంటే..,
భావిభారత సుందర సౌధానికి బంగారు బాటలు వేసే విద్యార్ధుల
పసిడికలల ప్రాకారాలన్నీ పేకమేడలలా కూలిపోతుంటే..
పాపపంకిల పూరిత ప్రవేశ పరీక్షల ఊబిలో చిక్కుకొని ,
అన్యాయంగా అధోగతికి నెట్టబడిన అమాయకులు విడిచే అశృవుల సుడిగుండాలలో పడి
నేడు భరతమాత మునిగిపోనున్నది.

అందుకే ..

ఏనాడు జాతిహితయుక్త ప్రవేశ పరీక్షలలో చెడుగుని చెరగివేయగలమో..,
ఏనాడు కాగితంపులులవంటి నామమాత్ర ప్రవేశ పరీక్షలు
భీకరబొబ్బులులై అన్యాయాన్ని, అసమర్ధతను అణచివేసి ప్రతిభకు పట్టం కట్టగలవో,
ఏనాడు విద్యావంతులు అవినీతిపరులపై విప్లవశంఖం పూరించి విజయపథం లో పయనించగలరో..,

ఆనాడు ..
ఎటు చూసినా ఉండే ఎంట్రన్స్ ల సంరంభం
విద్యార్ధుల భావిజీవితానికి శుభారంభం
అదే..
భరతవర్ష బంగారు భవితకు
హర్ష భరిత శుభారంభం.

17, జనవరి 2012, మంగళవారం

ఒక హౌస్ సర్జన్ మనోవేదన

చిగురించకనే వసివాడిన లేతకొమ్మా!
పాడ్యమి నాడే రాహువు మింగిన చందమామా!


నీ లేలేత గళం నుండి ఏ గానకోకిల ఉద్భవించి,
కమనీయ రాగాలతో ఈ అవనిపై అమృతవర్షం కురిపించేదో....?

నిర్లక్ష్య వైఖరితో, నిరంకుశ కర్కశ పాదాలతో
నీ కంఠం కమిలిపోయేలా కసిగా కాలరాశారు.


నీ మనొగగనం లో ఏ కవికోకిల జనియించి,
అమృత తుల్య రచనలతో పుడమిని పులకరింప చేసేదో.....?


దుర్భేద్య పరిస్థితుల దుర్భర అగాధంలో పడవేసి,
నిరుపేదవన్న నిరాదరణ జ్వాలల్లో త్రోసివేసి,
నీ పుర్రెను పూడ్చివేసారు,
నీ మస్తిష్కాన్ని మసి చేసారు.


తెరువకనే మూసిన ఆ కన్నులనుండి
విశ్వ ప్రేమను చాటే ఏ విశ్వమాత
కారుణ్య భరిత దృక్కులు వెల్లి విరిసేవో.....?

మానవత్వాన్ని మంటగలిపి,
కారుణ్యాన్ని కాల్చివేసి,
ప్రేమను పరిసమాప్తం చేసారు.
అందరి అనాదరణకు నిన్ను ఆహుతి చేసారు.


పురిటిలోనే పుణ్యలోకాలకు చేరిన పుత్తడి బొమ్మా!

కౄరమృగాల మధ్య చిక్కిన లేడిపిల్లలా ..
భయం భయం గా శ్వాసిస్తున్న నీకు,
నా ఊపిరి పంచాలని పలువిధాల ప్రయత్నించానమ్మా..

పుట్టకముందే అనేక అసహాయతలతో అలసిపోయి,
గునపాలు గ్రుచ్చబడ్డ నీ గుండెను
స్పందింప చేయాలని శతధా శ్రమించానమ్మా..

నిన్ను ఏడ్పించి, నీ తల్లిని నవ్వించాలన్న తపనతో ..
నీ పసి దేహాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టానమ్మా..


కానీ......

పాడు బ్రతుకు బ్రతకటం కోసం నిరంతరం మనసుని చంపుకుంటూ..
అనుక్షణం చస్తూ బ్రతికే మీరు ఏడవాలిగానీ నేనెందుకు ఏడ్వటం అనుకున్నావేమో...

పైసల కోసం శిశువుల అశువులు సైతం లెక్క చేయని పశువులున్న
పాపిష్ఠి లోకాన్ని పరిహసిస్తూ పుణ్యలోకాలకు పయనించావు.

జాలిగలవారిపై కూడా జులుం చేసే అధికారుల రాజ్యంలో ,
అసహాయురాలినైన నేను మాత్రం ,
నీ మరణాన్ని ధృవీకరించడం తప్ప మారు మాటాడలేకపోయాను.


గర్భకుహరం నుండే అంతిమ గమ్యం చేరిన చిట్టితల్లీ!

అందరిలాగే తానూ నిన్ను అసహాయంగా వదిలి,
అమ్మ అమృతం అందకుండా అడ్డుపడి,
భగవంతుడు నీకు శాపమే ఇచ్చాడో..?

లేక

కర్కొటకులై క్షణ క్షణం కాలకూటం చిందించే
కర్కశ నాగుల వంటి కౄర మానవుల కబంధహస్తాలనుండి కాపాడి,
కరుణతో తన కడకు చేర్చుకొని,
నీకు కమ్మని వరమే ప్రసాదించాడో..?
ఆ భగవంతుడినే అడుగమ్మా.


పసిపాపకు పాలిస్తానన్న పసిడి కలలతో
ప్రసవ వేదన పడ్డ పిచ్చి తల్లి మరణతుల్య వేదనకు
సార్ధకత్వం చేకూర్చమని చెతులెత్తి ప్రార్ధించినా..
దూరంగా ఉన్నానని నా ప్రార్ధనను పట్టించుకోలేదేమో..?
ఎందుకిలా జరిగిందని
నిన్ను తనలో ఐక్యం చేసుకున్న ఆ భగవంతుని నువ్వైనా నిలదీయమ్మా..


పాపపుణ్యాలెరుగని పసిపాపల గర్భస్థవేదనను
దురంతం చేసే దురాశాపరుల దుష్టత్వాన్నీ,

ప్రత్యక్ష దైవాలైన కన్న తల్లుల ప్రసవవేదనను
నిరర్ధకం చేసే నిర్దయుల నిర్లక్ష్యాన్నీ,

మానవత్వంతో స్పందించే నావంటి వారి మనో వేదనను
అపహాస్యం చేసే అమానుష హృదయుల ఆభిజాత్యాన్నీ..
అంతం చేయమని
ఆ అంతర్యామిని నీవైనా అర్ధించమ్మా...

10, జనవరి 2012, మంగళవారం

గీటురాయి

నా గురువు నన్ను 'విధేయతగల విద్యార్ధి ' అని ప్రశంసిస్తే..,
నా పై అధికారి 'ఎంతో నమ్మకమైన వ్యక్తి ' అని నన్ను అభినందిస్తే..,
నా ఇరుగుపొరుగువారు నన్ను 'ఎంతో స్నేహపూరిత మనస్కురాలు ' అని పొగిడితే..,
నా కూతురి అత్తమామలు 'మర్యాద తెలిసిన మనిషి ' అని నన్ను అభిమానిస్తే..,
నా అల్లుడు 'మా అత్తగారికి నేనంటే ఎంతో అభిమానం' అని ఆనందపడితే..,

నేను ఏదో పెద్ద మంచిదాన్నని అర్ధం కాదు,
నేను చెడ్డదాన్ని కాదనే అర్ధం అస్సలుకే రాదు.
ఖచ్చితంగా చెప్పాలంటే 'లౌక్యం తెలిసిన మనిషి ' మాత్రమే అవుతా.!!!!

నా శిష్యులు తెలివితక్కువగా అడిగే చిన్న చిన్న సందేహాలను కూడా ఓపికగ సమాధానం చెప్పి,వారి అభివృధ్ధికై తపన పడగలిగితే...,
నా ఇంట్లో పనిమనిషుల కష్టసుఖాలు అర్ధం చేసుకొని వాళ్ళని మనుషులుగా
చూడగలిగితే...,
నా కంటే పేదవారికి మనస్ఫూర్థిగా చేతనైన సహాయం చేయగలిగితే,
నా కొడుకు అత్తమామలు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని కూడా 'అతిధి దేవొభవ ' అని గౌరవించగలిగితే..
నా కోడలికి కూడా అల్లుడికి ఇచ్చిన ఫ్రేమ,అభిమానం,విలువ ఇవ్వగలిగితే....

"నేను సాధించినదంతా మా గురువు పెట్టిన భిక్ష" అని ఎదిగిన శిష్యులు నిన్ను తలుచుకొన్ననాడు,
"మా అమ్మగారు సానా దయగల తల్లి" అని నా పనిమనిషి తో అనిపించుకో గలిగిననాడు,
"దేవుడు నిన్ను చల్లగా చూడాలి" అనే ఒక పేద హృదయపు స్వచ్చమైన దీవెనలు పొందగలిగిననాడు,
"ఎంతో పుణ్యం చేసుకుని మా కూతురు మిమ్మల్ని అత్తగా పొందింది " అని నా వియ్యపురాలితో అనిపించుకోగలిగిననాడు,
"మీరు ఇంట్లో లేకపోతే మాకు బాగోదు అత్తయ్యా, ఊరి నుంచి త్వరగా వచ్చేయండి" అని నా కోడలు నాతో అన్ననాడు,ఆ భావం ఆమె కళ్ళలో స్పష్టం గా చూడగలిగిననాడు...

అప్పుడే నేను నిజంగా మంచిదాన్నని అర్ధం.

ఎందుకంటే...
సమాజం, సాంప్రదాయం, అంతస్థు, అవసరాల పరంగా నాకంటే పై అంతస్థులో ఉన్నవారితో, నా సాటివారితో మంచి అనిపించుకునేట్లు ప్రవర్తించకపోతే...,

నన్నొక్క తన్ను తన్నటం, నన్ను దూరంగా తొయ్యెటం 'వాళ్ళకొక్క క్షణం పని ' అని తెలిసిన
లౌక్యపు మంచితనం మంచితనానికి గీటురాయి కానేకాదు.

నాకంటే తక్కువ అని సమాజం, సాంప్రదాయాలు నిర్దేశించినవారితో..

"నాతో వారికి తప్ప వారితో నాకు అవసరం లేదు అని " నేను భ్రమించే వారితో సహృదయంతో మెలగగలగటమే..

నా మంచితనానికి కొలమానిక..
అదే.. మనిషిలోని దైవత్వానికి తొలిదీపిక